Headlinesజిల్లాలో కార్యాలయాలు లేని గ్రామ పంచాయతీలు

జిల్లాలో కార్యాలయాలు లేని గ్రామ పంచాయతీలు

Link Copied!

కార్యాలయాలు లేని గ్రామ పంచాయతీలు..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి, పినపాక, కామేపల్లి: జిల్లాల పునర్విభజన తరువాత పదుల సంఖ్యలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా గిరిజన తండాలు , ఆదివాసి గూడెలు పంచాయతీలుగా మారటంతో ఆయాచోట్ల అభివృద్ధిపై ఆశలు చిగురించాయి. కానీ అసలు సమస్య అక్కడే మొదలైంది.

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలల్లో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీల పరిస్థితి ‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్నట్టుగా తయారైంది.చేతికందిన అధికారాన్ని చెలాయించటానికి సొంత భవనం లేకపోవటం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారింది. ఉభయ జిల్లాల్లో 2025 మార్చి నాటికి 332 భవనాల నిర్మాణం చేపట్టగా సుమారు 132చోట్ల పనులు పూర్తయ్యాయి. మిగతావి అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.

ములకలపల్లి మండలంలోని రాచన్న గూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం లేకపోవడంతో గత పాలక వర్గంలో సర్పంచిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి ఇంట్లోనే గ్రామ సచివాలయాన్ని నిర్వహించారు. ఇటీవల ఈ గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగగా నూతన పాలకవర్గం కొలువుదీరింది.శాశ్వత పంచాయతీ భవన నిర్మాణం పూర్తికాకపోవటంతో పాత సర్పంచి ఇంట్లోనే గ్రామ సచివాలయాన్ని నిర్వహిస్తుండటం గమనార్హం.

సర్కారు బడులు, అద్దె ఇళ్లల్లో ‘పంచాయతీ’ సొంత భవనాలు లేకపోవటంతో నూతన పాలకవర్గాలు అరకొరవసతు లతోనే నెట్టుకొస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లోని అదనపు గదులు, మరికొన్నిచోట్ల అద్దె ఇళ్లు, ఇంకొన్ని చోట్ల ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రామ సచివాలయాలను నిర్వహిస్తున్నారు.

నూతన గ్రామపంచాయతీలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా అనేక గ్రామాల్లో శాశ్వత భవనాలు నిర్మించటంలో పాలకులు విఫలమవుతున్నారు. నిధుల లేమి, స్థల వివాదాలు వెరసి కొత్త పంచాయతీ భవనాల నిర్మాణం ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్నట్లుగా తయారైంది. కొత్తగా కొలువుదీరిన పాలకవర్గాలు శాశ్వత భవన నిర్మాణ అంశాన్ని సవాల్ గా తీసుకోవాల్సిన అవసరముంది. లేనిపక్షంలో కొత్త పాలకవర్గాలు సైతం పాత సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడాల్సిందే.

ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ..
నూతన గ్రామపంచాయతీల్లో సచివాలయ నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.కొన్ని ప్రారంభానికి సిద్ధమవుతు న్నాయి. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వాటికి నిధుల కొరత రాకుండా చూస్తున్నాం. లక్ష్యాలకు అనుగుణంగా శాశ్వత భవనాలు నిర్మిస్తామని తెలిపారు..

తాజా వార్తలు

Related Articles