బ్యాలెట్ తోనే మున్సిపాలిటీ ఎన్నికల పోరు.
ఆదిలాబాద్.
మున్సిపాలిటీ ఎన్నికలు గతంలో మాదిరిగానే అధికారులు బ్యాలెట్ తోనే నిర్వహించనున్నారు. ఇందుకోసం వాటిని సిద్ధం చేస్తున్నారు. పంచాయితీ ఎన్నికలు ముగిసిన వెంటనే గోదాములలో భద్రంగా ఉండడంతో అవసరమైన వాటిని మున్సిపాలిటీ అధికారులకు అప్పగించనున్నారు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలలో ఈ బ్యాలెట్ బాక్స్ లను భద్రపరిచారు.
మునిసిపాలిటీ అధికారులు తమకు ఎన్ని బ్యాలెట్ బాక్స్ లు అవసరమనేది లెక్కలు వేశారు. 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలనే ఉన్నతాధికారుల ఆదేశాలతో సరిపడ కేంద్రాలను ఎంపిక చేశారు. వార్డుల్లో ఉన్న ఓటర్లను విభజించి కేంద్రాలు అందుబాటులో ఉంచుతారు. ఒక వార్డులో 2,908 మంది ఓటర్లు ఉంటే 800 ఓటర్ల చొప్పున 2400 మంది ఓటర్లకు మూడు కేంద్రాలు అవసరం ఉంటుంది. మిగిలిన 508 మంది ఓటర్లకు మరో కేంద్రం అంటే, నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
మునిసిపాలిటీ లో ఓటర్లు : 1,43,773
ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాలు : 183
బ్యాలెట్ బాక్స్ ల ప్రతిపాదన : 260
అదనంగా బాక్సులు : 52
ప్రస్తుతం వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాలు పెంచాల్సి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. బాక్సుల కోసం ఇప్పటికే మున్సిపాలిటీ అధికారులు, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
