Headlinesగ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం

గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం

Link Copied!

న్యూస్ టుడే: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అన్నారు. మండల పరిషత్తు కార్యాలయంలో ఇటీవల ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులకు శనివారం ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వారిని సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండేళ్లుగా గ్రామాల్లో పాలక వర్గం లేక పంచాయితీ కార్యదర్శులతో పాటు ప్రత్యేక అధికారులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. పంచాయితీ కార్యదర్శులతో కలిసి సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత సర్పంచుల దేనని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన వారంతా తమ ఖర్చుల వివరాలను ఆయా ఎంపీడీవో కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు. డి ఎల్ పి ఓ లక్ష్మణ్, ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, ఎం పి ఓ గంగా సింగ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మణ చాంద: గ్రామ అభివృద్ధిలో సర్పంచులు పోటీ పడాలని, అధికారులుగా పూర్తి సహకారం అందిస్తామని ఎంపీడీవో రాధ అన్నారు. లక్ష్మణ చాంద మండల పరిషత్తు కార్యాలయంలో సర్పంచులతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధికారులకు, సర్పంచులకు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ ఓ నసిరోద్దీన్, ఏపీవో ప్రమీల, ఏ ఈ సంజయ్, పంచాయితీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.
దిలావర్ పూర్: నూతన సర్పంచులు తమ పాలనలో గ్రామ అభివృద్ధి భావితరాలకు గుర్తుండేలా సేవలు అందించాలని మండల ప్రత్యేక అధికారి శంకర్, ఎంపీడీవో అరుణలు అన్నారు. శనివారం మండలంలోని నూతన సర్పంచులను సన్మానించారు.
కుబీరు: నూతనంగా ఎన్నికైన సర్పంచులు పంచాయితీల అభివృద్ధితోపాటు, బడిలోని సమస్యలను పరిష్కరించాలని పల్సి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దొంతుల సురేష్ అన్నారు. శనివారం పల్సి, సిర్పెల్లి, సోనారి, గోడ పూర్, పల్సి తండా, హం పోలి సర్పంచులు సత్యవ్వ, ఆరేపల్లి సతీష్, నరసింహ, మోరే పల్లవి, ఆడే అర్జున్, దత్తాత్రి తో పాటు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు.
దస్తురాబాద్: మండలంలోని సర్పంచులను దస్తురాబాద్ లో శనివారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దుర్గం మల్లేష్, బుట్టాపూర్ మాజీ ఉపసర్పంచి తిప్పని రంజిత్ సన్మానించారు.
కుంటాల: మండలంలోని 15 గ్రామ పంచాయతీల సర్పంచులను శనివారం కుంటాల మండల పరిషత్తు కార్యాలయంలో అధికారులు శాలువాతో సత్కరించి అభినందించారు. గ్రామాల అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్య క్రమంలో సమన్వయముతో కృషి చేద్దామని పేర్కొన్నారు. ఎంపీడీవో అల్లాడి వనజ, తహసిల్దార్ కమల్ సింగ్, ఎంపీ ఓ అబ్దుల్ రహీం, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles