ది లీడర్స్ డైరీ: కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆర్వో, ఏఆర్ఓలకు శిక్షణ పొరపాట్లకు తావివ్వకుండా మున్సిపల్ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాలోని కరీంనగర్ నగరపాలిక, హుజురాబాద్, చొప్పదండి , జమ్మికుంట మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి టీఓటీ, ఆర్వో, ఏఆర్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. హ్యాండ్ బుక్ ను క్షుణ్ణంగా చదివి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఆర్వోల పాత్ర కీలకమన్నారు. నామినేషన్ల స్వీకరణ, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి విషయం పరిశీలిస్తూ..
ఏఆర్ఓలు, క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. విధులను బాధ్యతగా నిర్వర్తిస్తూ క్రాస్ చెక్ చేసుకుంటూ సమస్యలు తలెత్తకుండా ముందు చూపుతో వ్యవహరించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ చేసే విధానం వివరించారు. ఏవైనా అనుమానాలు ఉంటే ఉన్నత అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. నగరపాలిక కమీషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలవేళ అప్రమత్తంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ఆర్వోలు, ఏఆర్ఓలు తమ విధులను పక్కాగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.
