బీర్ల ఐలయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.
బీర్ల ఐలయ్య 06 జూన్ 1975లో తెలంగాణ రాష్ట్రంయాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలం, సైదాపురం గ్రామంలో బీర్ల సామరాజు, బుచ్చమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1991లో యాదాద్రి భువనగిరిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యను, 1994లో ఆలేరులోని శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి కళాశాలలో ఇంటర్మీడియట్, భువనగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ డిగ్రీ కళాశాల నుండి 1997లో డిగ్రీ పూర్తి చేశాడు.
బీర్ల ఐలయ్య విద్యార్థి దశ నుండే రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) లో చేరి శ్రీ లక్ష్మీ నరసింహ డిగ్రీ కళాశాలలో కాలేజ్ సెక్రటరీ పని చేశాడు. ఆయన 2006లో స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సైదాపురం గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ఐలయ్య ఆ తరువాత 2008లో యాదగిరిగుట్ట మండల అధ్యక్షునిగా, 2013లో యాదగిరిగుట్ట టౌన్ ఎంపీటీసీగా ఎన్నికై, టీపీసీసీ కార్యదర్శిగా, ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్గా వివిధ హోదాల్లో పని చేశాడు.
బీర్ల ఐలయ్య 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత చేతిలో ఓడిపోయాడు. ఆయన 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతపై 49204 ఓట్ల భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనను 2023 డిసెంబర్ 15న ప్రభుత్వ విప్‌గా ప్రభుత్వం నియమించింది.