బహుముఖ ప్రజ్ఞ… అకుంఠిత దీక్ష… నిర్విరామకృషి
పట్టుదలకు పర్యాయపదం – పిట్టల రవీందర్
ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఎన్ని అంశాలపైన తన ప్రతిభను నిరూపించుకోగలడు? ఎన్ని రంగాలలో తమ కార్యకలాపాలను విస్తరించగలడు? ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలుసుకోవాలంటే అరవై సంవత్సరాల వయస్సులోకి అడుగుపెడుతున్న పిట్టల రవీందర్ జీవనగమనంలోకి తొంగిచూడవలసిందే! జర్నలిస్టుగా, స్వతంత్ర పరిశోధకునిగా, కవిగా, రచయితగా, ఉద్యమనాయకునిగా, ఆలోచనాపరునిగా, ప్రేరణ కలిగించే ఉపన్యాసకునిగా, స్ఫూర్తిదాయకమైన ఉపాధ్యాయునిగా … నిత్యకృషీవలునిగా అకుంఠిత దీక్షాదక్షతలతో బహుముఖంగా ఆయన ప్రదర్శించిన ప్రజ్ఞాపాటవాలు అనితరసాధ్యాలుగా ప్రశంసించడంలో ఎలాంటి సందేహాలకు తావులేదు. పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతానికి కేంద్రమైన గోదావరిఖని పట్టణంలో ఒక ప్రైవేటు పాఠశాలలో పార్ట్ టైం ఉపాధ్యాయునిగా చిరుద్యోగంతో పిట్టల రవీందర్ కెరీర్ మొదలైంది.
తర్వాత కాలంలో న్యూస్ రిపోర్టర్ గా చేసి … పూర్తికాలపు జర్నలిస్టుగా మారారు. దినపత్రిక ఎడిటర్ స్థాయివరకూ ఎదిగి, ఆ క్రమంలో తన కళ్లముందు కదం తొక్కిన ప్రజాపోరాటాలలోనూ, పౌరహక్కుల ఉద్యమాలలోనూ, సింగరేణి గనికార్మికుల ఆరాట పోరాటాలలోనూ తెరవెనుక చోదకశక్తిగా మమేకమై నారు. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
ఏ రంగంలో పనిచేసినా ఆ రంగానికి సంబంధించిన అధ్యయనం, పరిశీలన, ఆ అంశాలపైన సమగ్రమైన అవగాహనను స్వీయ అధ్యయనం ద్వారా పెంపొందించుకోవడం పిట్టల రవీందర్ ప్రత్యేకత! ఆయన ఎంచుకున్న రంగాలలో పరిణతిని సాధించడానికి, అగ్రభాగాన నిలవడానికి నిరంతరమైన అధ్యయనంతో పాటుగా అకుంఠిత దీక్ష, నిర్విరామకృషి, నియమ నిబద్ధతలే కారణమని పిట్టల రవీందర్ బలంగా నమ్ముతారు. అందుకే పట్టుదలకు పిట్టల రవీందర్ పర్యాయపదంగా నిలుస్తారు. ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి అధ్యయనం, భావవ్వాప్తి, కార్యాచరణ” అనే రాజ్యాంగ బద్ధమైన మూడంచెల సిద్ధాంతానికి రూపకల్పన చేసి, ఆచరించి నిరూపించారు. పిట్టల రవీందర్ తన నలభై సంవత్సరాల సుదీర్ఘమైన ప్రజాజీవిత ప్రయాణంలో అనేక రంగాలలో తనదైన ముద్రను వేసి అలుపెరుగని బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. అనుసరణీయమైన ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
పిట్టల ఉపేందర్, పిట్టల వీరమ్మ దంపతులకు 24 మే 1963 సంవత్సరంలో కరీంనగర్ జిల్లా వీణవంక గ్రామంలో జన్మించిన పిట్టల రవీందర్ పాఠశాల విద్యను వీణవంక ప్రభుత్వ పాఠశాలలోనూ, ఇంటర్, డిగ్రీ విద్యను గోదావరిఖని ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేశారు. మైసూర్ యూనివర్శిటీ నుండి జర్నలిజం కోర్సు పూర్తిచేసారు. ఉన్నత చదువులు సర్టిఫికేట్ల కోసమో, పేరుపక్కన అలంకారం కోసమో, ఉద్యోగ అర్హతలకోసమో కాకుండా విద్య విజ్ఞాన సముపార్జన కోసమేనని నమ్మి చదివిన బి.ఇడి., ఎం.బి.ఏ., పి.జి డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్, రిఫ్రెషర్ కోర్స్ ఇన్ మోబైల్ జర్నలిజం (మోజో), ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం నుండి డిస్టెన్స్ లర్నింగ్ ఇన్ ఆక్వాకల్చర్, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఆక్వాప్రెన్యూర్షిప్ మేనేజ్మెంట్, మంచినీటి ముత్యాల సాగు కి సంబంధించి సర్టిఫికేట్ కోర్స్ మంచినీటిలో సముద్రపు నాచు ఉత్పత్తిలో సర్టిఫికెట్ కోర్స్, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ బయోఫ్లాక్ ఫిష్ ఫార్మింగ్ టెక్నాలజీ…పూర్తి చేశారు. అలాగే రీ-సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టం, కేజ్ కల్చర్ ప్రాక్టీస్ లాంటి అనేక అంశాలపై అవగాహన పెంచుకున్నారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మత్స్యసహకార సంఘంలో ప్రాధమిక సభ్యునిగా కొనసాగుతున్న పిట్టల రవీందర్ 2014 నుంచి తెలంగాణ మత్స్యరంగంపైన సమగ్రమైన అధ్యయనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రంగం మీద ఇంతవరకూ పరిశీలించిన అంశాల ఇతివృత్తంగా వివిధ తెలుగు, ఆంగ్ల దినపత్రికల్లో వందకు పైగా వ్యాసాలను ప్రచురించారు. ఈయన వ్యాసాలు హిందీ, తమిళం, మళయాళం, కన్నడ తదితర భాషల్లోనూ ఆయా పత్రికల్లో అనువాదాలుగా ప్రచురితమయ్యాయి.
తెలంగాణ ఫిషరీస్ సొసైటీ అనే సంస్థను ఏర్పాటు చేసి వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. మత్స్యరంగం మీద అనేకమైన జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు, సదస్సులలో పాల్గొని ప్రసంగించారు. అనేక నివేదికలను సమర్పించారు. వరల్డ్ అక్వాకల్చర్ సొసైటీ, ఏషియన్ ఫిషరీస్ సొసైటీ, వరల్డ్ ఫిష్ సెంటర్ లాంటి అనేక అంతర్జాతీయ సంస్థలలో కూడా పిట్టల రవీందర్ సభ్యులుగా కొనసాగుతున్నారు. భారతదేశంలో చేపల ఉత్పత్తిలో ప్రధానపాత్రను పోషిస్తున్న 13 రాష్ట్రాలలో పర్యటించారు. ఆయా రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను, అమలుపరుస్తున్న పథకాలను అధ్యయనం చేసి వ్యాసాలుగా ప్రచురించారు. అనేక దక్షిణాసియా దేశాలలో కూడా పర్యటించారు. ఈ రంగం మీద తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఇప్పటికే పలు పుస్తకాలను కూడా వెలువరించారు.;దక్షిణభారత మత్స్యకార కులాల ఐక్యవేదిక ను ఏర్పాటు చేసి గడచిన రెండు సంవత్సరాలుగా కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.
1983లోనే జర్నలిజాన్ని వృత్తిగా స్వీకరించి అనేక తెలుగు, ఇంగ్లీషు పత్రికల్లో రిపోర్టర్ నుండి ఎడిటర్ స్థాయివరకు పాత్రికేయునిగా పనిచేసారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ, వార్త, ఉదయంలాంటి ప్రధాన పత్రికలతోపాటు రచ్చబండ, జీవగడ్డ, ప్రజాతంత్రలాంటి పత్రికల్లోనూ దాదాపు 40 సంవత్సరాలుగా జర్నలిస్టుగా అనుభవం గడించారు. సింగరేణి గని కార్మికులకోసం ప్రత్యేకంగా చర్చ అనే తెలుగు దినపత్రికను అనేక సంవత్సరాలపాటు గోదావరిఖని కేంద్రం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎందరో ఔత్సాహిక పాత్రికేయులను తీర్చిదిద్దారు.
తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమానికి చేదోడువాదోడుగా ఆయన తన పత్రికలను తీర్చిదిద్ది, రాష్ట్రం ఏర్పాటయ్యేవరకూ హైదరాబాద్ నుండి నిర్వహించారు. ప్రస్తుతం ;ఫ్రీలాన్స్ జర్నలిస్టు;గా కొనసాగుతున్నారు. యాక్టీవ్ జర్నలిస్టుగా పనిచేస్తున్న కాలంలోనే జర్నలిస్టుల ఉద్యమాలలో కూడా క్రియాశీలకమైన పాత్రను నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్ర ఉనికికాలంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం లో రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, కరీంనగర్ జిల్లా ప్రధానకార్యదర్శిగా, అధ్యక్షునిగా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా అనేక సంవత్సరాలపాటు బాధ్యతలను నిర్వహించారు.
గోదావరిఖని, వరంగల్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కూడా బాధ్యతలను నిర్వహించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా బాధ్యతలను నిర్వహించిన కాలంలోనే సింగరేణి సంస్థద్వారా జర్నలిస్టుల బృందంతో కోల్ ఇండియా పర్యటనను నిర్వహించి, మొట్టమొదటిసారిగా గోదావరిఖనిలో ;కోల్‌బెల్ట్ పాత్రికేయుల సదస్సు ను నిర్వహించారు. అదేవిధంగా వరంగల్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా బాధ్యతలను నిర్వహించిన సమయంలోనే హన్మకొండ నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో వరంగల్లు ప్రెస్ క్లబ్ కోసం స్థల సేకరణకు నాయకత్వం వహించి, అక్కడ ఒక తాత్కాలిక భవనాన్ని సైతం నిర్మించడంలో కీలకపాత్ర పోషించారు.
సింగరేణి గని కార్మికులు నిర్వహించిన అనేక పోరాటాలలోనూ, ఉద్యమాలలోనూ పరోక్షపద్ధతుల్లో అత్యంత క్రియాశీలకమైన పాత్రను నిర్వహించారు. సింగరేణి గనికార్మికులు నిర్వహించిన అనేక చరిత్రాత్మకమైన సమ్మెలకు బాసటగా నిలవడంతోపాటుగా కార్మికుల డిమాండ్ల సాధన విషయంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. సింగరేణి బొగ్గుగనుల ఫలితంగా కోల్‌బెల్ట్ ప్రాంతాలలో విజృంభించిన కాలుష్యాలపైనా, ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకాల ఫలితంగా జరుగుతున్న విధ్యంసాలను బయటి ప్రపంచానికి వినిపించడంలోనూ, చూపించడంలోనూ, సమాజాన్ని చైతన్యపరచడంలోనూ ప్రముఖమైన పాత్రను పోషించారు.
బొగ్గుగనుల ప్రాంతాలలోని భూనిర్వాసితుల పక్షాన నిలిచి వారి పోరాటాలకు ప్రత్యక్ష, పరోక్ష మద్దతును అందించారు.తెలంగాణ విద్యావంతుల వేదికకు నాయకత్వం వహించిన సందర్భంలోనే కాలరీ కవాతు అనే వినూత్నమైన కార్యక్రమాన్ని రూపొందించి కార్మికవాడలను, బొగ్గుగనులను ఒక బృందంగా సందర్శించి వారిలో చైతన్యాన్ని నింపేందుకు పిట్టల రవీందర్ విశేషంగా కృషిచేసారు.
హైదరాబాద్ నుండి సీనియర్ జర్నలిస్టులను, వివిధ పత్రికల సంపాదకులను, వివిధ రంగాలకు చెందిన ఆలోచనాపరులను సమీకరించి ఓపెన్ కాస్ట్ మీడియా యాత్రను నిర్వహించి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల విధ్వంసానికి సంబంధించిన పరిణామాలను దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు దోహదం చేసారు. ఈ పర్యటన అనుభవాలను క్రోడీకరిస్తూ, ఓపెన్ కాస్ట్ బొగ్గుగనులు కలిగిస్తున్న పర్యావరణ సమస్యలపై ‘భూమిపుండు’ అనే చరిత్రాత్మకమైన పుస్తకాన్ని ప్రచురించారు. ఇదే క్రమంలో;బొగ్గు పొరల్లో … అనే కవితా సంకలనాన్ని కూడా పిట్టల రవీందర్ వెలువరించారు.
పౌరహక్కుల సంఘం నాయకుడు బాలగోపాల్ తో కలిసి నిజనిర్ధారణ కమిటీల్లో భాగస్వామిగా చురుకైన పాత్రను నిర్వహించారు. ఇదే సమయంలో తెలంగాణలో యువకుల మిస్సింగ్ కేసుల విషయంలో అప్పటి ప్రభుత్వం నియమించిన టి.ఎల్.ఎన్.రెడ్డి ఏకసభ్య కమిషన్ కి పౌరహక్కుల సంఘం సమర్పించిన నిజనిర్ధారణ నివేదికను రూపొందించడంలో డాక్టర్ కె. బాలగోపాల్ కి చేదోడువాదోడుగా నిలిచారు. సింగరేణి గనికార్మిక ప్రాంతాలలో కార్మికోద్యమాలలో పనిచేస్తున్న విప్లవ కార్మిక సంఘాలను సమన్వయపరచడంలోనూ పిట్టల రవీందర్ తెరవెనుక పాత్ర ను నిర్వహించారు. గోదావరిఖని కోల్‌బెల్ట్ కేంద్రంగా వెలుగులోకివచ్చిన ;జన రక్షణ సంస్థ;ప్రజాసేవ లాంటి అనేక స్వతంత్ర సాయుధసంస్థలకు మేధోపరమైన సహకారాన్ని అందించారు.
ఏకకాలంలో సింగరేణి బొగ్గుగని కార్మికోద్యమాలు, తెలంగాణలో ఊపిరిసలపని రైతాంగ ప్రజాఉద్యమాలు, కత్తిమీదసాములాగా సాగిన క్రియాశీలమైన పాత్రికేయవృత్తి ఉద్యమాలలో పనిచేస్తున్న కాలంలోనే సాహిత్యకృషిని పిట్టల రవీందర్ కొనసాగించారు. సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతాలలో జరిగిన సాహిత్య స్రవంతిలో ప్రధాన భాగస్వామిగా నిలిచారు. సామాజిక సంక్షోభాల నుండి బహుళప్రజానీకాన్ని సురక్షితంగా కాపాడుకోవడంలో ప్రజాపౌరహక్కుల ఉద్యమాలతోపాటు పాత్రికేయ, సాహిత్య రంగాలకు కూడా గురుతరమైన బాధ్యత ఉంటుందని విశ్వసించడంతోపాటుగా, వీటన్నింటిలోనూ క్రియాశీలకమైన పాత్రను పిట్టల రవీందర్ నిర్వహించారు.
సమకాలీన సామాజిక అంశాలతోపాటుగా అందులో భాగమైన సింగరేణి బొగ్గుగని కార్మికుల మసిబారిన జీవితాలను ప్రధానాంశాలుగా ఆయన తన రచనల్లో ప్రతిబింబించారు. అందుకు ఆయన కవిత్వాన్ని కూడా ఒక ప్రధానమైన సాధనంగా ప్రయోగించారు.
ఇందుకు నిదర్శనంగా ‘బొగ్గుపొరల్లో అంతర్మథనం అనే రెండు కవితా సంకలనాలను,;సింగరేణిలో సంస్కరణలు-ఒక పరిశీలన సింగరేణి వ్యాసాలు , సింగరేణి పరిణామాలు -పర్యవసానాలు; సకలజనుల సమ్మెలో సింగరేణి-ఒక పరిశీలన లాంటి అనేక పుస్తకాలను పిట్టల రవీందర్ వెలువరించారు. పిట్టల రవీందర్ తాను భాగస్వామిగా పనిచేసిన అన్ని ఉద్యమాల సందర్భాలను, అప్పటి పరిణామాలను, పర్యవసానాలను వ్యాసాలుగా అన్ని ప్రధాన దినపత్రికల్లో రాశారు. అలాగే వాటిని పుస్తకరూపంలో ప్రచురించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉ ద్యమ ప్రస్థానంలో భాగంగా వెలుగుచూసిన ప్రధాన ఘట్టాలను పిట్టల రవీందర్ గ్రంధస్తం చేసారు. అందులో ప్రధానంగా ;తెలంగాణ మార్చ్-సాగరహారం;తెలంగాణ-మిలియన్ మార్చ్— మానుకోట-మే 28…చర్చ – తెలంగాణ వ్యాసాలు.. కాంగ్రెస్ ఐదేండ్లపాలన – విద్రోహం, విధ్వంసం.. ;తెలంగాణ ఉద్యమంలో తెరవెనుక దృశ్యాలు…. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ డైరీ తదితర అనేక చరిత్రాత్మకమైన పుస్తకాలను వెలువరించారు.
మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో దాదాపు 15 సంవత్సరాలపాటు పూర్తికాలపు ఉద్యమకారునిగా పనిచేసిన పిట్టల రవీందర్ తెలంగాణ భావవ్యాప్తిలోనూ, ఉద్యమ కార్యాచరణలోనూ రాష్ట్రస్థాయిలో ముఖ్య భూమికను పోషించారు. ఈ క్రమంలో తీవ్రమైన నిర్భంధాలను ఎదుర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ భావవ్యాప్తిలో ముఖ్యపాత్రను పోషించిన తెలంగాణ విద్యావంతుల వేదిక ; ఏర్పాటులోనూ, నిర్మాణంలోనూ, విస్తరణలోనూ ప్రధానపాత్రను పోషించారు.;తెలంగాణ విద్యావంతుల వేదిక … ఉపాధ్యక్షునిగా, ప్రధానకార్యదర్శిగా పిట్టల రవీందర్ రాష్ట్రవ్యాపితంగా వివిధ రంగాలకు చెందిన విద్యావంతులను ఉద్యమ భావవ్యాప్తిలోకి సమీకరించడంలో నిర్విరామకృషిని కొనసాగించారు.తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా, కన్వీనర్ గా ఉద్యమ కార్యాచరణలో నిర్ణయాత్మకమైన భూమికను నిర్వహించారు. ఈ క్రమంలో అనేక పోలీసుకేసులను, అరెస్టులను, జైలు జీవితాన్ని సైతం ఎదుర్కొన్నారు.
సకల జనుల సమ్మె నిర్వహిస్తున్న సందర్భంలో పిట్టల రవీందర్ ను సింగరేణి ప్రాంతాలలో పర్యటించనీయకుండా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. సాగరహారం నిర్వహించిన సమయంలో పిట్టల రవీందర్ ను పోలీసులు కిడ్నాప్ చేసి చీకటిగదిలో 24గంటలపాటు రహస్యంగా నిర్భంధించారు. సహాయ నిరాకరణ ఉద్యమ సందర్భంలో కొత్తగూడెంలో పిట్టల రవీందర్ పై ఉద్యమద్రోహులు హత్యాప్రయత్నం చేసారు. భౌతికదాడికి పూనుకున్నారు. పిట్టల రవీందర్ తన జీవితం లో అధిక కాలం ఉద్యమాలకోసమే పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ అంతిమ ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతున్న సమయ సందర్భంలోనే ముందుచూపు కలిగిన సహచరుల్లో అనేకమంది తమ రాజకీయ, సామాజిక భద్రతలకు పునాదులు వేసుకునే ముందస్తు ఆచరణలో మునిగితేలుతున్న తరుణంలో పిట్టల రవీందర్ మాత్రం తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యమ శ్రేణుల పాత్రకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసే పనిలోనే నిమగ్నమయ్యారు. అయితే ఉద్యమ నాయకత్వంలోని అగ్రనేతలకు సైతం రాజకీయపరమైన ఆలోచనలున్నట్లు గమనించిన పిట్టల రవీందర్ కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రనిర్మాణంలో ఉమ్మడి రాష్ట్ర ఉనికి కాలంలో విస్మరణకు, అణచివేతకు గురైన అణగారిన సామాజికవర్గాల పక్షాల కొంతకాలంపాటు స్వచ్ఛందంగా పనిచేయాలని నిశ్చయించుకున్నారు.
తొలి ప్రయత్నంగా తమ సామాజికవర్గం ముదిరాజ్ ప్రజల్లో ఐక్యతను సాధించేందుకు అవసరమైన నాయకత్వాన్ని నిర్మించాలనే ఉద్దేశ్యంతో ;ముదిరాజ్ అధ్యయన వేదిక ;ను ఏర్పాటు చేసి జాతికి సంబంధించిన విద్యావంతులను, ఆలోచనాపరులను సమీకరించేందుకు అన్నిజిల్లాల్లో పర్యటించి సత్ఫలితాలను సాధించారు. ముదిరాజుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి, వాటి పరిష్కారానికి ఒక బలమైన రాజకీయ వ్యక్తీకరణ నిర్వహించడానికి ప్రత్యామ్నాయంగా ఒక;కులసంఘం ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించి 2014 నవంబర్ 21వ తేదీన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఏర్పాటును ప్రకటించి, ఆ సంఘానికి డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ ను అధ్యక్షునిగా ప్రకటించారు. తాను ఏర్పాటు చేసిన కులసంఘానికి కేవలం సలహాదారుడు పాత్రకు మాత్రమే పరిమితమై, తన భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ కోసం తెలంగాణ మత్స్యరంగాన్ని తన కార్యక్షేత్రంగా ఎంచుకుని కొనసాగిస్తున్నారు.