ములక సురేష్ – Mulaka Suresh

Mulaka Sureshములక సురేష్ – ఖమ్మం జిల్లా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన ఒక కెరటం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుడిగా భావజాల వ్యాప్తిలో ముందు వరుసలో ఉండి నడిపిన నాయకుడు. ఖమ్మం అంటేనే భూమి తెలంగాణ ఆకాశం ఆంధ్ర అన్న నానుడి, ఆంధ్ర వలసవాదుల గుమ్మంగా పేరు ఉంది .జై తెలంగాణ అంటేనే నేరంగా భావించే కాలంలో తెలంగాణ విద్యావంతుల వేదికను తన భుజస్కందాలపై వేసుకుని ఖమ్మంలో ఉద్యమ కేంద్రంగా బాసిల్లిన చైతన్య స్రవంతి ములక సురేష్.

రామ నర్సయ్య, విజయలక్ష్మి దంపతుల తొలి సంతానం. పుట్టింది ఉద్యమ కేంద్రమైన మానుకోటలో అయినా తండ్రి ఉపాధ్యాయ వృత్తి రీత్యా 15 కిలోమీటర్ల దూరంలో గల పాత ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గంధం పల్లి గ్రామంలో అతని బాల్యం గడిచింది ఆ గ్రామం ఆంధ్ర వలస వాదుల ఆధిపత్యం అధికంగా ఉన్న గ్రామం. అందుకే విద్యార్థి దశలోనే తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజలు పడుతున్న బాధలను అవమానాలను ఆకలింప చేసుకున్నాడు. పాఠశాల విద్య గంధం పల్లీ లోనే జరిగింది ప్రజాకవి జయరాజు పాఠశాల సహచరుడు ఆ గ్రామంలో ఆంధ్ర వలసవాదుల దాస్టికాలు అధికంగా ఉన్న రోజులు తెలంగాణ భాషను యాసను సంస్కృతిని అవమానిస్తుంటే బాధపడిన సందర్భాలెన్నో ఆ తర్వాత ఇంటర్ విద్య కొత్తగూడెంలోని రామచంద్ర కళాశాలలో పూర్తి చేశాడు అక్కడే విద్యార్థి ఉద్యమాల పట్ల ఆకర్షితుడై కళాశాల యాజమాన్యం అవినీతి, అకృత్యాలపై విద్యార్థి నాయకుడిగా పోరాటాలు చేశాడు. మండల కమిషన్ అమలుకు అనుకూలంగా స్పందిస్తూ నాటి ఉద్యమంలో బడుగు బలహీన వర్గాల ఐక్యతకు కృషి చేశాడు తదుపరి డిగ్రీ ఖమ్మంలోని SR & BGNR కళాశాలలో పూర్తి చేశాడు.

1992లో మానుకోటలో ప్రైవేట్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేశాడు ఆ క్రమంలోనే ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలపై స్పందిస్తూ ప్రైవేటు టీచర్స్ ఫెడరేషన్ ఏర్పాటు లో కీలక భూమిక పోషించి యాజమాన్య అకృత్యాలు, అనాగరిక చర్యలు ,వేతనాలు పెంపు తదితర అంశాలపై పోరాటాలు నడిపాడు.ఆ తరువాత బాల కార్మికుల పాఠశాల బాల వెలుగులు లో ఉపాధ్యాయుడిగా పని చేశారు ఆ క్రమంలోని బాల కార్మికుల కష్టాలు అవగతం చేసుకుని వ్యాసాలు పాటలు కవితలు రాశాడు.

1996లో సుమతి ఆయన జీవిత భాగస్వామిగా అడిగింది వీరికి సృజన్ మిత్ర, శ్రీ లిఖిత సంతానం. అదే సంవత్సరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా బయ్యారం మండలంలో పనిచేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ పాశం యాదగిరి ప్రొఫెసర్ బియ్యాల జనార్ధన్ ప్రొఫెసర్ కోదండరాం గారి ఉపన్యాసాలు,తెలంగాణ జనసభ తో ప్రభావితమైనాడు. ఉద్యోగరీత్యా 2006లో ఖమ్మం చేరుకుని అప్పుడే పురుడు పూసుకున్న తెలంగాణ విద్యావంతుల వేదిక బాధ్యతలు స్వీకరించాడు తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ గా ఐక్య కార్యాచరణ కమిటీ కార్యదర్శిగా జయశంకర్ సార్ చెప్పినట్లు ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ ఎస్ యు వరకు తెలంగాణ అనుకూలంగా ఉన్న అనేక సంఘాలతో పని చేస్తూ భావజాల వ్యాప్తిలో కీలక భూమిక పోషించాడు.

ఉద్యమ క్రమంలో ఆచార్య జయశంకర్ సార్ ,పాశం యాదగిరి ,కోదండరాం సార్ దేశపతి శ్రీనివాస్, పిట్టల రవీందర్, నందిని సిద్ధారెడ్డి, శ్రీధర్ దేశ్ పాండే, విట్టల్ ,గూడా అంజయ్య, దేవేంద్ర గౌడ్, నాయని నర్సింహారెడ్డి మందకృష్ణ మాదిగ, స్వామి గౌడ్ దేవి ప్రసాద్ ప్రొఫెసర్ తిరుమలి విమలక్క,సంధ్య,అల్లం నారాయణ జూలూరి తదితరులతో వేదికని పంచుకుని ఆయన ఉపన్యాసంతో వారి ప్రశంసలు అందుకున్నాడు. బయ్యారంలో ఇనుప రాయి క్వారీని పరిశీలించి ప్రభుత్వమే ఖనిజ సంపదను వెలికి తీయాలని బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలని సదస్సులు నిర్వహించాడు అప్పటి 9 జిల్లాలు ఒకవైపు ఖమ్మం జిల్లా ఒకవైపుగా ఉన్న పరిస్థితి తెలంగాణ వ్యతిరేక శక్తులు బలంగా ఉన్న ఈ జిల్లాలో ఉద్యమం నడపడం అంటే సాహసోపేతమైన చర్య.

ఖమ్మంలోని అన్ని రంగాలలో వల సాంద్రవాదుల చేతుల్లో ఉన్నటువంటి స్థితి. ఆ సమయంలో జయశంకర్ సార్ చెప్పిన నీళ్లు నిధులు నియామకాల్లో మనకు జరిగిన అన్యాయాన్ని ప్రతి గడపకు చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుడు కంటే తెలంగాణ ఉద్యమ నేతగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. భావజాల వ్యాప్తిలో తనకంటూ పేరు సంపాదించాడు. ఆ రోజుల్లో రిక్కా బజార్ పాఠశాల ఉద్యమానికి కేంద్ర బిందువు. అక్కడ జరిగిన అనేక బహిరంగ సభల్లో మలక సురేష్ చేసిన అద్భుత ప్రసంగాలు ఎందరినో చైతన్యవంతులను చేసినాయ్. సభికులు ఆయన ప్రసంగం కోసం ఎదురు చూసే వాళ్లంటే అతిశయోక్తి కాదు.

2004 నుండి ప్రతి సెప్టెంబర్ ఒకటిని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం గా చరుపుతుండగా ఉద్యమ కారులు విద్రోహ దినంగా పాటిస్తూ అరెస్టయినా సందర్భాలు కోకొల్లలు. 2007లో తెలంగాణ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో పంతుల్ల లొల్లి నిర్వహించాడు. ఆ రోజుల్లో అది సంచలనం ఒకటి, రెండు ఉపాధ్యాయ సంఘాలు తప్ప తెలంగాణకు సహకరించిన సందర్భంగా అయినా ప్రొఫెసర్ ఖాసింతో పెద్ద ఎత్తున బహిరంగ సభను రిక్క బజార్ పాఠశాలలో నిర్వహించి ఖమ్మం తెలంగాణ గడ్డ అని నిరూపించాడు.

2007లో తెలంగాణ విద్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా మహాసభ నిర్వహించారు ఆ కార్యక్రమానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోదండరామ్ లు ముఖ్య అతిథులుగా హాజరైనారు.2008లో తెలంగాణ ధూమ్ ధామ్ ప్రదర్శనలో తెలంగాణలోని ప్రముఖ కళాకారులు హాజరైన విమలక్క, పాశం యాదగిరి, గూడా అంజన్న ,పైలం సంతోష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2009లోTNGO లతో కలిసి 610 జీవో అమలు ఉద్యమంలో పాల్గొన్నాడు.

2010లో ఇల్లందు పట్టణంలో విద్యావంతుల వేదిక జిల్లా మహాసభములక సురేష్ అధ్యక్షతన 1000 మంది తో న భూతో న భవిష్యత్తు అన్న రీతిలో నిర్వహించాడు. వెయ్యి మంది సభ్యులు ఆ క్రమంలోనే ఖమ్మంలో రాష్ట్ర మహాసభలు కూడా నిర్వహించాడు. ప్రో.హరగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2007 ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థి పొలికేక హాజరై కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. క్విట్ తెలంగాణ కార్యక్రమం ఇందిరా పార్కులు నిర్వహించారు .తెలంగాణ ఉద్యమ సంఘాలన్నీ కలిసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం విశేషం. 2009 నవంబర్ లో కేసీఆర్ నిరాహార దీక్షకు మద్దతుగా బహిరంగ ప్రకటన చేసాడు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఆ రోజుల్లో అది సంచలనం.కెసిఆర్ ను అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లాకు తరలించిన సందర్భం లో సబ్ జైల్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాడు.

2011లో సకలజనుల సమ్మె విజయవంతం కోసం విద్యార్థులను చైతన్య పరచడం కోసం తెలంగాణ లెక్చరర్స్ ఫోరం తో కలిసి ఖమ్మంలోని అన్ని కళాశాలలో అవగాహన తరగతులు నిర్వహించాడు. సకలజనుల సమ్మె విజయవంతం కావడం కోసం అనేక సంస్థల, సమాఖ్యలు,సంఘాలు ఏర్పాటు చేసి ధర్నాలో పాల్గొనేటట్లు చేయడం విశేషం. 27 ఫిబ్రవరి 2008లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా ఖమ్మం నుండి ఆయన నాయకత్వంలో అనేకులు హాజరయ్యారు ఆ కార్యక్రమం గద్దర్ పాశం యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించారు .ముఖ్య అతిథిగా L.k. అద్వానీ హాజరయ్యారు.

మిలియన్ మార్చ్ సందర్భంగా గృహనిర్బంధాన్ని ఎదుర్కొన్నాడు సాగరహారం విజయవంతం చేయడం కోసం మానుకోట నుండి గార్ల వరకు పాదయాత్రను నిర్వహించారు. సాగరహారంలో పాల్గొనేందుకు మిత్ర బృందంతో కలిసి వెళుతున్న ఆయనను జనగామలో అరెస్టు చేశారు 2010 మే 28 వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు మానుకోట రైల్వే స్టేషన్ లో జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు తరువాత మానుకోట రైల్వే స్టేషన్ ఘటన పైన వాల్పోస్టర్ ఖమ్మంలో పెద్ద ఎత్తున ఆవిష్కరించారు తెలంగాణ ఏర్పాటుకు ముందు సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించి పలు సదస్సులు నిర్వహించారు ఆ సదస్సులకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాశం యాదగిరి ప్రొఫెసర్ తిరుమలే విమలక్క కూరపాటి వెంకటనారాయణ తదితరులు హాజరయ్యారు తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఐక్య కార్యాచరణ కమిటీ ఐక్యవేదిక తదితర సంఘాలతో కలిసి పని చేశారు.

ప్రతి సంవత్సరం జయశంకర్ సార్ కాళోజి కొండా లక్ష్మణ్ బాపూజీ దాశరధి వంటి తెలంగాణ ప్రముఖుల జయంతులు వర్ధంతిలు నిర్వహించాడు జయశంకర్ భావజాలం పేరుతో జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాడు1996 నుండి 2014 వరకు తెలంగాణ ఏర్పాటు వరకు అవిశ్వాంతంగా పోరాడిన నికార్శైన తెలంగాణ వాదిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఏర్పాటు మాత్రమే కాదని తెలంగాణలో సామాజిక న్యాయం ప్రజాస్వామిక వాదం పరిఢవిల్లాలని ఏ ఆకాంక్షల కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా పాలకులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆ క్రమంలో ఉద్యమకారులు కవులు కళాకారులు మేధావులు ప్రజల పక్షం దహించాల్సిన అవసరం ఉందని ఆయన ఆకాంక్షించారు.