
ది లీదర్స్ డైరీ : మాంజా దారానికి చిక్కుకుని విలవిలలాడుతున్న గద్దను హైదరాబాద్ బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చెట్టు కొమ్మలలో చిక్కుకుని ఉండగా రక్షించారు. అడిషనల్ పోలీస్ కమిషనర్ శ్రీమతి ఏ. లక్ష్మి, అదనపు ఉప పోలీస్ కమిషనర్, ట్రాఫిక్-1, మల్కాజ్గిరి మరియు జి. శంకర్ రాజు, సహాయ పోలీస్ కమిషనర్, ట్రాఫిక్, త్రిముల్ఘెర్రీ గమనించి చావు బ్రతుకుల్లో ఉన్న గద్దను మాంజ చెరనుంచి విడిపించారు. ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సహకారంతో, గద్దకు మరింత హాని కలగకుండా ఎంతో జాగ్రత్తగా చెట్టుపై నుండి దింపి, దాని కాళ్లకు బిగుసుకుని ఉన్న నిషేధిత మాంజాను తొలగించి అవసరమైన సంరక్షణ అందించారు. అధికారుల మరియు సిబ్బంది యొక్క సమయోచిత చర్యల వల్ల గద్ద ప్రాణాపాయం నుండి తప్పించుకొని కొద్ది సేపటి తరువాత సురక్షితంగా ఎగిరిపోయింది…
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, నిషేధిత మాంజా వాడకం పక్షులు, జంతువులకే కాకుండా మానవ జీవితాలకు కూడా తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని, పలుమార్లు ప్రాణాంతక గాయాలు మరియు మరణాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ప్రజలు చట్టాన్ని కచ్చితంగా పాటిస్తూ, నిషేధిత మాంజా వాడకాన్ని పూర్తిగా మానుకొని, ప్రజా భద్రత మరియు పర్యావరణ పరిరక్షణకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సంఘటన ద్వారా, ట్రాఫిక్ పోలీసు శాఖ కేవలం రహదారి భద్రత మరియు ట్రాఫిక్ నియంత్రణకే పరిమితం కాకుండా, మాటలేని పక్షుల ప్రాణాలను కూడా కాపాడే సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నదని స్పష్టమవుతోంది.
