నగర పురపాలికల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ
నేడు ఖరారు చేయనున్న అధికారులు
అనంతరం ఎన్నికల సంఘానికి జాబితా
హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న ఏడు నగర పాలక సంస్థలు 116 పురపాలక సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ రిజర్వేషన్లపై స్పష్టత రానుంది. వాటిని శనివారం అధికారులు ఖరారు చేయనున్నారు . అనంతరం ఆ నివేదికలను ఎన్నికల సంఘానికి సమర్పిస్తారు. నగర పురపాలికల్లో ఎస్సీ, ఎస్టీ ,బీసీ , మహిళ జనరల్ స్థానాల జాబితాను బుధవారం రాష్ట్ర పురపాలక విడుదల చేసింది. మేయర్లు చైర్ పర్సన్ లతో పాటు డివిజన్లు వార్డుల వారీగా రిజర్వేషన్లను శనివారం అధికారులు విడుదల చేయనున్నారు. మేయర్లు, పురపాలిక చైర్పర్సన్ స్థానాలు హైదరాబాద్ లో ఖరారు చేస్తారు. జిల్లాలోని వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసి , జిల్లా గెజిట్ లో తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
రొటేషన్ లో… రిజర్వేషన్లు…
రొటేషన్ విధానం అవలంబిస్తున్నందున గత ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లు మారతాయి. గత ఎన్నికల్లో రిజర్వ్ అయిన వార్డులను వదిలివేసి జనాభా ఎక్కువగా ఉన్న మిగిలిన వార్డులకు రిజర్వేషన్లను కల్పిస్తారు. ముందుగా ఎస్టీ ,తర్వాత ఎస్సి, అనంతరం బీసీల సీట్లు ఖరారు అవుతాయి .తరువాత మహిళ రిజర్వ్డ్ స్థానాలను ఎంపిక చేస్తారు. హైదరాబాద్ జిల్లాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా తీసి మహిళలకు రిజర్వ్ చేసిన వార్డులను ఖరారు చేస్తారు. అనంతరం పురపాలక అధికారులు ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పిస్తారు. దీంతో ప్రభుత్వ పరంగా మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. దీని ఆధారంగా ఎన్నికల సంఘం ఏ క్షణమైనా షెడ్యూల్ను వెలువరించే వీలుంది. ఈనెల 18న మేడారంలో మంత్రి మండలి సమావేశం జరగనుంది. అందులో ఎన్నికల తేదీలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఆమోదించిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే వీలుంది. నగర పాలక సంస్థలు పురపాలక సంఘాల్లో మేయర్లు, చైర్పర్సన్లు డివిజన్లు వార్డుల వారీగా రిజర్వేషన్లపై అన్ని రాజకీయ పార్టీల్లో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. మేయర్ పీఠం చైర్పర్సన్ పీఠాలకు రిజర్వేషన్లపైనే ఆశావాహుల భవిష్యత్ ఆధారపడి ఉంది.
