ప్రశాంతంగా ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీస్ బందోబస్తు
విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం-జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల
నిర్మల్ జిల్లా పరిధిలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తిగా ప్రశాంత వాతావరణంలో సాగిందని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, వెల్లడించారు.ఎన్నికల పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు.
ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని గ్రామాలలో అదనపు పోలీసు బలగాలను మోహరించామని, లెక్కింపు కేంద్రాల పరిసరాలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి విజయోత్సవాల ర్యాలీలకు అనుమతి లేదని, శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. నియమావళి ఉల్లంఘనకు ఎవరూ ప్రయత్నించకూడదని, ప్రజలు మరియు అభ్యర్థులు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
