
నిర్దిష్ట గడువులో గా వేగవంతంగా పనులు పూర్తి చేయాలి
ది లీడర్స్ డైరీ: జిల్లాలో వివిధ శాఖల పరిధిలోకొనసాగుతున్న ఇంజనీరింగ్ పనులను వేగవంతం చేసి నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంజూరైన పనులు ఆలస్యం కావడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుంటూ, ఇకపై ఆలస్యం సహించబోమని స్పష్టం చేశారు. ప్రతి పనిని ప్రాధాన్యతగా తీసుకుని వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు మంజూరై చాలా కాలం గడిచినా పూర్తి చేయకపోవడంపై ప్రశ్నించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పరిధిలో తాగునీటి పైప్లాన్ల లు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణ పనుల పురోగతిపై సమగ్ర నివేదికలు అందించాలని తెలిపారు. పబ్లిక్ హెల్త్, రోడ్లు, భవనాలు, ట్రైబల్ వెల్ఫేర్, విద్యుత్ శాఖల పనుల పురోగతిని సమీక్షిస్తూ శాఖల మధ్య సమన్వయం పెంచి పనులను వేగవంతం చేయాలని సూచించారు. అటవీ శాఖ అనుమతులు, భూసంబంధిత సమస్యలు వంటి ఆటంకాలు ఉన్నచో వెంటనే పరిష్కరించుకోవాలని, అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. రహదారుల నిర్మాణం, ఇందిర మహిళా శక్తి భవనాలు, యంగ్ ఇండియా పాఠశాలల పనుల పురోగతిని కూడా సమీక్షిస్తూ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ పరిధిలో చేపడుతున్న సీతమ్మ సాగర్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనుల పురోగతిని కూడా సమీక్షించారు. ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వలు, పంప్ హౌస్లు తదితర పనులను సమయానికి పూర్తి చేయాలని సూచించారు. అన్ని పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని, ప్రతి రోజు పనుల పురోగతిపై నివేదికలు సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు సమయానికి అందించేందుకు అధికారులు కట్టుబడి పనిచే యాలని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ అర్జున్ రావు, పంచాయతీరాజ్ శాఖ ఈఈ శ్రీనివాస్, ఆర్అండ్ బీ శాఖ ఈఈ నాగేశ్వరరావు, విద్యుత్ శాఖ ఎస్సీ మహేందర్, మిషన్ భగీరథ ఈఈలు తిరుమలేష్, నళిని, పబ్లిక్ హెల్త్ శాఖ డీఈ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
