రిజర్వేషన్ ఏమవుతుందో? ఆశావహుల్లో ఆందోళన
పుర, నగరపాలికల్లో ఓటరు తుది జాబితా వెల్లడి కావడంతో అందరి దృష్టి రిజర్వేషన్ల వైపు మళ్ళింది. ప్రధాన పార్టీలోని ఆశావహులతో పాటు స్వతంత్రులుగా పోటీ చేయాలనుకున్నవారు ఈ విషయమై ఆందోళన చెందుతున్నారు. తమ వార్డు, డివిజన్లో ఏ రిజర్వేషన్ ఖరార్ అవుతుందోననే కంగారు పడుతున్నారు మంగళవారం నుంచి అధికారులు రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియలో నిమగ్నం అవనున్నారు. ముఖ్యంగా కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో డివిజన్లో పెరగడం పునర్విభజనలో డివిజన్ల రూపురేఖలు మాడముతో తమకు అనుకూలమైన ప్రాంతం విషయమై తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటివరకు లోలోపల ప్రచారం చేసుకుంటున్న వారు రిజర్వేషన్ అనుకూలించకుంటే పరిస్థితి ఏమిటి అని ఆందోళనలో ఉన్నారు.
పార్టీల దృష్టి సారింపు
పుర పోరు సందడి ఇప్పటికే నగరాలు, పట్టణాల్లో కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బారాస, భాజపాలు ఈ ఎన్నికలను సవాలుగా స్వీకరిస్తున్నాయి. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తామని ఇప్పటికే నేతలు ప్రకటిస్తున్నారు. గట్టి అభ్యర్థి అని భావించిన చోట ఇంకా రిజర్వేషన్లు ఖరారు కాకముందే వీరే అభ్యర్థిని శ్రేణులకు చెబుతున్నారు. దీంతో పాటు అన్ రిజర్వ్డ్ వస్తే పలానా అభ్యర్థి అని, బిసి వస్తే వీరని, ఎస్సీ రిజర్వేషన్ అయితే మరొకరిని ముందే పార్టీలో పోటీదారులు ఎవరో నిర్ణయించుకుంటున్నారు. తరువాత తిరుగుబాటు ఇబ్బంది ఉండవద్దని ఉద్దేశంతో ముందుగానే సర్దుబాటు ధోరణిలో వెళ్లాలని ఆశావహులకు సూచిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బల్దియాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవాలని డి సి సి అధ్యక్షులకు ఆదేశాలు ఇచ్చింది. ఇదే సమయంలో బారాస అధిష్టానం ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో హైదరాబాదులో సమావేశం నిర్వహించి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేసింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కూడా ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువ స్థానాలు గెలిచేలా వ్యూహాలు పన్నుతుండడంతో షెడ్యూల్ కు ముందే రసవత్తరమైన పోరు కనిపిస్తోంది.
