వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు,వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి గతంలో ప్రకటించిన హామీ మేరకు తన గౌరవ వేతనాన్ని గ్రామపంచాయతీ సిబ్బందికి అందజేస్తూ మరోసారి సేవాభావాన్ని చాటుకున్నారు.

తాను సర్పంచ్‌గా ఉన్న ఐదేళ్ల కాలానికి సంబంధించిన గౌరవ వేతనాన్ని గ్రామపంచాయతీ సిబ్బందికి అందజేస్తానని గతంలో ప్రకటించిన ఆయన, ఆ హామీలో భాగంగా ఇప్పటి వరకు అందిన ఐదు నెలల గౌరవ వేతనం రూ.32,500 (ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు)ను ఈరోజు గ్రామపంచాయతీ సిబ్బందికి నగదు రూపంలో అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బంది సర్పంచ్ బిల్లా యాదగిరి గారి ఉదారతను, సేవా దృక్పథాన్ని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. తమ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గౌరవ వేతనాన్ని అందజేసినందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్ , గ్రామపంచాయతీ కార్యదర్శి విజయ మరియు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
