Headlinesసర్పంచ్ ఆమెనే.. పాలన మాత్రం భర్తదే!

సర్పంచ్ ఆమెనే.. పాలన మాత్రం భర్తదే!

Link Copied!

అధికార హోదా లేకున్నా పంచాయతీపై పెత్తనం?

నారాయణపూర్‌లో సర్పంచ్ భర్త ఏకపక్ష పాలనపై కలెక్టర్‌కు ఫిర్యాదు

పంచాయతీ వ్యవహారాల్లో సర్పంచ్ కంటే భర్తదే ప్రధాన పాత్ర అంటూ ఆరోపణలు

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామ పంచాయతీలో ప్రజల చేత ఎన్నికైన సర్పంచ్‌కు బదులుగా ఆమె భర్తే పంచాయతీ వ్యవహారాలను నడిపిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారిక హోదా లేకపోయినా గ్రామ పాలనలో సర్పంచ్ భర్త పెత్తనం కొనసాగుతోందని వారు విమర్శిస్తున్నారు.

గ్రామస్థుల కథనం ప్రకారం, పంచాయతీలో చేపట్టే అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారులతో సమావేశాలు, ఇతర పరిపాలనా వ్యవహారాల్లో సర్పంచ్ కంటే ఆమె భర్తే ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పాలకవర్గ సభ్యులను, గ్రామ ప్రజలను పక్కనపెట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

అంతేకాకుండా, గ్రామంలోని తాగునీరు, పారిశుద్యం, డ్రైనేజీ, వీధి దీపాలు, సీసీ రోడ్ల వంటి మౌలిక వసతుల సమస్యలపై ప్రశ్నించినప్పుడు సదరు నాయకుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని గ్రామస్థులు వాపోతున్నారు. “ఏం చేసుకుంటారో చేసుకోండి” అంటూ సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు.

పాలకవర్గ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకోవడం, సమావేశాలకు ఆహ్వానించకపోవడం, ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిందని గ్రామస్థులు మండిపడుతున్నారు. సర్పంచ్ భర్త అధికార దుర్వినియోగంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, గ్రామ పంచాయతీలో చట్టబద్ధమైన ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించాలని నారాయణపూర్ వాసులు కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

అయితే, తనపై వస్తున్న ఆరోపణలను స్థానిక సర్పంచ్ ఖండించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరు వ్యక్తులు, రాజకీయ ప్రత్యర్థులు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

గ్రామస్థుల ఫిర్యాదుపై జిల్లా యంత్రాంగం ఎలా స్పందిస్తుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

తాజా వార్తలు

Related Articles