Headlinesఅభివృద్ధి చేశాం.. అప్పులపాలయ్యాం

అభివృద్ధి చేశాం.. అప్పులపాలయ్యాం

Link Copied!

బిల్లుల కోసం మాజీ సర్పంచుల ఎదురుచూపులు.. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు

కరీంనగర్: గ్రామ ప్రథమ పౌరులుగా గ్రామాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి, అధికారులు సూచించిన పనులను సక్రమంగా పూర్తి చేసినా.. చేసిన పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో అప్పులపాలయ్యామని 2019లో ఎన్నికైన మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, సంఘ భవనాలు, పాఠశాల భవనాల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టామని, వాటికి సంబంధించిన బిల్లులు నాలుగు, ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని వారు వాపోతున్నారు. పదవీకాలం పూర్తయి రెండున్నరేళ్లు గడిచినా బిల్లులు అందకపోవడంతో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెబుతున్నారు.

మొగ్దుంపూర్ మాజీ సర్పంచికి రూ.39.50 లక్షల బకాయిలు

కరీంనగర్ గ్రామీణ మండలం మొగ్దుంపూర్ గ్రామ జనాభా 3,094. గ్రామ మాజీ సర్పంచి జక్కం నర్సయ్య హయాంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి సుమారు రూ.39.50 లక్షల బిల్లులు రావాల్సి ఉందని తెలిపారు.ఎస్ఎఫ్‌సీ కింద రూ.2.50 లక్షలు, ‘మన ఊరు–మన బడి’ పథకం కింద బిల్డింగ్ నిర్మాణానికి రూ.7.50 లక్షలు, స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5 లక్షలు, మేస్త్రీ సంఘ భవన నిర్మాణానికి రూ.5 లక్షలు, సీసీరోడ్లకు రూ.10 లక్షలు, జడ్పీ నిధుల ద్వారా చేపట్టిన సీసీరోడ్లు, డ్రైనేజీ పనులకు రూ.5 లక్షలు బకాయి ఉన్నట్లు నర్సయ్య పేర్కొన్నారు.

బిల్లులు రాక అప్పులపాలు

అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి అప్పులు చేశామని, కొందరు తమ కుటుంబ సభ్యుల బంగారు నగలను సైతం అమ్మి పనులు పూర్తి చేయించారని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి అధికారులు సకాలంలో పనులు పూర్తి చేయాలని ఒత్తిడి చేయడంతో గ్రామ అవసరాల దృష్ట్యా పనులు పూర్తి చేశామని, ఇప్పుడు తమకు రావాల్సిన బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అంటున్నారు.

ప్రత్యేకాధికారుల పాలనతో మరింత జాప్యం

గ్రామ పంచాయతీల్లో సుమారు 22 నెలలపాటు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. గతేడాది డిసెంబరులో ఎన్నికలు నిర్వహించడంతో కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. గ్రామాల్లో ఇప్పటికే అనేక సమస్యలు ఉండటంతో ప్రస్తుత సర్పంచులు అందుబాటులోకి వచ్చిన నిధులను అత్యవసర అవసరాలకు వినియోగించారు.దీంతో గత పాలకవర్గాల హయాంలో చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించడంలో మరింత జాప్యం జరుగుతోందని మాజీ సర్పంచులు చెబుతున్నారు.

మాజీ సర్పంచులు–ప్రస్తుత సర్పంచుల మధ్య ఘర్షణ వాతావరణం

మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో కొన్ని గ్రామాల్లో మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచుల మధ్య వివాదాలు నెలకొంటున్నాయి. తమ హయాంలో గ్రామాభివృద్ధి కోసం పనులు పూర్తి చేశామని, ఇప్పుడు బిల్లులు ఎందుకు మంజూరు చేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.20 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. తమకు రావాల్సిన బిల్లులు ఎప్పుడు, ఏ విధంగా చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలని మాజీ సర్పంచులు కోరుతున్నారు.

“అధికారంలో ఉన్న వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వద్దు”

గ్రామాభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు పూర్తి చేసిన మాజీ సర్పంచులు, ఇప్పుడు తమ బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులు చేసిన వారిని బిల్లుల కోసం వేడుకునే పరిస్థితిలో ఉంచకుండా, ప్రభుత్వం పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని వారు కోరుతున్నారు.

“అభివృద్ధి చేశాం.. అప్పులపాలయ్యాం. చేసిన పనులకు బిల్లులు అడగడం మా హక్కు. అధికారంలో ఉన్న వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి ఉండకూడదు. తమ అడుగులకు మడుగులొత్తేవారిగా కాకుండా, గ్రామాభివృద్ధి కోసం పనిచేసిన సర్పంచులకు న్యాయం చేయాలి” అని మాజీ సర్పంచులు కోరుతున్నారు.

తాజా వార్తలు

Related Articles