అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
జీపీ, గ్రామ సమైక్య, అంగన్వాడీ భవనాలపై సమీక్ష
హైదరాబాద్: గ్రామపంచాయతీ, గ్రామ సమైక్య, అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో ఆయా భవనాల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో మొత్తం 9,745 గ్రామ సమైక్య భవనాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 534 భవనాల నిర్మాణం పూర్తయింది. మరో 6,141 భవనాల నిర్మాణ పనులు పురోగతిలో ఉండగా, 3,070 భవనాల పనులు ప్రారంభం కావాల్సి ఉందని అధికారులు మంత్రికి వివరించారు.అలాగే 3,906 గ్రామపంచాయతీ భవనాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 444 భవనాల నిర్మాణం పూర్తయింది. మిగిలిన భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
2,313 అంగన్వాడీ భవనాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 200 భవనాల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 2,113 భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు అధికారులు వివరించారు.అంగన్వాడీ భవనాల నిర్మాణానికి అదనపు నిధులను సమీకరించేందుకు ఎంపీ లాడ్స్ నిధులను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇందుకోసం ఎంపీలకు తానే లేఖలు రాయనున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో భవనానికి రూ.8 లక్షల వరకు వినియోగించుకునే అవకాశం ఉందని, మిగిలిన రూ.4 లక్షల కోసం అందుబాటులో ఉన్న ఇతర నిధులను వినియోగించాలని కలెక్టర్లకు సూచించారు.
ప్రతి నెలా భవనాల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తానని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పనుల్లో జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో వ్యవహరించి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ఇదిలా ఉండగా, హ్యామ్ విధానంలో చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనులను దసరాలోపు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.
సమీక్షలో స్పెషల్ సీఎస్ దాన కిశోర్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ శృతి ఓఝా, పంచాయతీరాజ్ ఈఎన్సీ జగదీష్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
