పలు గ్రామాల్లో కార్యదర్శులు అందుబాటులో ఉండడం లేదని గ్రామస్తుల ఆరోపణలు.. పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలపై ఆవేదన
ఉప్పునుంతల మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామాల్లో ప్రజా సమస్యలు పేరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు కేవలం మొక్కుబడిగా గ్రామాల్లో పర్యటించి వెళ్లిపోతున్నారని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
గ్రామాల్లో పారిశుధ్యం, డ్రైనేజీ, చెత్తాచెదారం తదితర సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకంగా ఉంటుంది. అయితే కొందరు కార్యదర్శులు గ్రామాలకు క్రమం తప్పకుండా వెళ్లకుండా పది రోజులకోసారి వచ్చి వెళ్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే ఈ పరిస్థితి నెలకొందని వారు విమర్శిస్తున్నారు.
మధ్యాహ్నానికే ఇంటిబాట..
గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన పంచాయతీ కార్యదర్శులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సీబీ తండా గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి పది రోజులకు ఒకసారి గ్రామానికి వచ్చి వెళ్తున్నారని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు.ఇది ఒక ఉప్పునుంతల మండలంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.మహిళా సర్పంచులు, మహిళా రిజర్వేషన్లో సర్పంచులు ఉన్నచోట్ల కార్యదర్శులే సర్వస్వంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల సర్పంచులకు తెలియకుండానే ఓటీపీ చెప్పించుకుని డబ్బులు డ్రా చేసిన సందర్భాలు ఉన్నాయని వారు వాపోతున్నారు.
గ్రామంలోని మురికి కాలువలు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో పారిశుధ్యం అధ్వానంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. పలు గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలు మధ్యాహ్నానికే మూతపడుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై నిఘా ఏర్పాటు చేయాలని, విధులకు గైర్హాజరవుతున్న వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
విచారించి చర్యలకు ఆదేశిస్తా..: వరుణ్ తేజ్, ఎంపీడీవో, ఉప్పునుంతల మండలం
విధుల్లో అలసత్వం వహించే పంచాయతీ కార్యదర్శులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేలా ఆదేశిస్తామని ఎంపీడీవో వరుణ్ తేజ్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పంచాయతీ కార్యాలయంలోనే విధులు నిర్వహించాలని సూచించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే అక్కడికి రావాలని స్పష్టం చేశారు.
పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ దివ్యా దేవరాజన్ ఆదేశాలు
గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజూ ఉదయం 9 గంటలలోపు మొబైల్ యాప్లో హాజరు నమోదు చేసి, అనంతరం గ్రామాల్లో తమ విధులను నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ ఇటీవల ఆదేశించారు. ఒకటి కంటే ఎక్కువ గ్రామపంచాయతీలకు ఇన్చార్జి/అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యదర్శులు తమ ఒరిజినల్ పోస్టింగ్ గ్రామపంచాయతీలోనే ఉదయం 9 గంటలలోపు హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు.హాజరు నమోదు విషయంలో ఉదయం 9 గంటల గడువును కచ్చితంగా పాటించాలని సూచించారు. అయితే డీఎస్ఆర్ను రోజులో ఏ సమయంలోనైనా సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఈ ఆదేశాలను గ్రామపంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారులు తెలియజేయాలని కమిషనర్ సూచించారు.
