Headlinesపంచాయతీరాజ్‌ చట్టం – 2018 సవరణ బిల్లుకు ఆమోదం

పంచాయతీరాజ్‌ చట్టం – 2018 సవరణ బిల్లుకు ఆమోదం

Link Copied!

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 70 లోని సబ్ సెక్షన్ (3) కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్ట సవరణ బిల్లుకు 2026 సెప్టెంబర్ 10న తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది

గ్రామ పంచాయతీకి వచ్చే డబ్బు గ్రామ అభివృద్ధికే ఉపయోగపడాలి. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం గ్రామ అవసరాలకు అందుబాటులో ఉండాలి. నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలి. ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి. ఇదే మా ప్రజా ప్రభుత్వ విధానం.

మన దేశంలో గ్రామీణ స్థానిక సంస్థలను బలోపేతం చేయడం కోసం 73వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీలు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేసే సంస్థలుగా కాకుండా.. ప్రజలకు దగ్గరగా ఉండే స్వయం పాలనా సంస్థలుగా పనిచేయాలన్నదే దాని ప్రధాన ఉద్దేశం.
స్థానిక సంస్థలకు అధికారాలు, బాధ్యతలతో పాటు వాటికి అవసరమైన ఆర్థిక వనరులు కూడా ఉండాలి. అందుకే పంచాయతీలకు కొన్ని పన్నులు, సుంకాలు, ఫీజులు వసూలు చేసుకునే అధికారాలను కూడా కల్పించారు.

గ్రామ పంచాయతీలకు రోడ్లు నిర్మించడం, డ్రైనేజీలు ఏర్పాటు చేయడం, పారిశుధ్యం నిర్వహించడం, వీధి దీపాలు ఏర్పాటు చేయడం, తాగునీటి సరఫరా వంటి అనేక ప్రాథమిక పౌర సేవల బాధ్యతలు ఉన్నాయి.
జీపీల‌కు ఆదాయం సమకూర్చుకునే అధికారం ఇచ్చి.. ఆ ఆదాయాన్ని అవసరమైన సమయంలో వినియోగించుకునే స్వేచ్ఛ లేకపోతే స్థానిక స్వపరిపాలన ఎలా బలపడుతుంది? ఇదే ప్రశ్నకు సమాధానంగా ఈ సవరణను తీసుకొస్తున్నాం.

ప్రస్తుతం గ్రామ పంచాయతీలు తమ సొంత ఆదాయ వనరుల ద్వారా సమకూర్చుకునే నిధులను ప్రభుత్వ ట్రెజరీ ఖాతాలో జమ చేయాల్సి వస్తోంది. ఆ తర్వాత గ్రామ అవసరాలకు ఆ నిధులను వినియోగించుకోవాలంటే ట్రెజరీ ద్వారా నిధులను డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.

దీనికి ఒక నిర్దిష్టమైన ప్రక్రియ ఉంటుంది. అవసరమైన పత్రాలు, అనుమతులు, ఇతర ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని వల్ల కొన్నిసార్లు నిధుల వినియోగంలో ఆలస్యం జరుగుతోంది.గ్రామంలో సమస్య వస్తుంది..కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన డబ్బు అందుబాటులోకి రావడానికి ఎందుకు ఆలస్యం కావాలి? ఒక గ్రామంలో డ్రైనేజీ సమస్య వచ్చింది అనుకోండి..తాగునీటి పైప్‌లైన్ మరమ్మతు చేయాలి.. వీధి దీపాలు ఏర్పాటు చేయాలి..పారిశుధ్య పనులు చేపట్టాలి..చిన్నచిన్న అత్యవసర పనులు చేయాలి..

పంచాయతీ దగ్గర సొంత ఆదాయం ఉన్నప్పటికీ, ఆ డబ్బును వినియోగించుకునే ప్రక్రియలో ఆలస్యం జరిగితే ప్రజలు ఇబ్బందులు పడతారు. అందుకే పంచాయతీకి వచ్చిన సొంత ఆదాయం.. పంచాయతీ అవసరాలకు సకాలంలో అందుబాటులో ఉండాలి. అందుకే కేంద్ర,రాష్ట్ర ఫైనాన్సు క‌మిష‌న్ నిధుల‌ను బ్యాంకు ఖ‌తాల్లో జ‌మ అయిన‌ట్లుగానే..జీపీ సొంత ఆదాయం కూడా బ్యాంకు ఖాతాలో జ‌మ అయ్యేలా చ‌ట్టాన్ని స‌వ‌రిస్తున్నాం.

పంచాయతీరాజ్‌ చట్టం – 2018 సవరణ బిల్లుకు ఆమోదం
శాసనమండలిలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్‌ చట్టం -2018 సవరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. గురువారం మధ్యాహ్నం మండలి విరామం అనంతరం ప్రారంభం కాగానే మంత్రి సీతక్క ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎలాంటి సవరణలు లేకుండానే సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం సవరణ బిల్లు ఆమోదం పొందినట్టు ప్రకటించారు.

తాజా వార్తలు

Related Articles