జాయింట్ చెక్ పవర్‌పై పంచాయతీరాజ్ శాఖ దృష్టి
సర్పంచులు–ఉపసర్పంచుల చెక్ పవర్‌పై ప్రభుత్వం ఫోకస్
జాయింట్ చెక్ పవర్‌కు మార్పుల దిశగా కసరత్తు
గ్రామ పంచాయతీల్లో నిధుల నిర్వహణకు సంబంధించి సర్పంచులు–ఉపసర్పంచుల మధ్య తరచూ వివాదాలకు కారణమవుతున్న జాయింట్ చెక్ పవర్ అంశంపై పంచాయతీరాజ్ శాఖ దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, విధానం వల్ల కలుగుతున్న సాధక–బాధకాలను స్వయంగా తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు.
ఈ మేరకు రాష్ట్రంలోని ఎంపిక చేసిన సర్పంచులు, ఉపసర్పంచులతో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.
రెండు విడతలుగా ప్రజాప్రతినిధులతో అధికారులు చర్చలు జరపనున్నారు. ఉదయం 11 గంటలకు ఉమ్మడి జిల్లాల నుంచి ఎంపిక చేసిన సర్పంచులతో సమావేశం నిర్వహించనుండగా, మధ్యాహ్నం 3 గంటలకు ఇతర జిల్లాలకు చెందిన ఉపసర్పంచులతో భేటీ కానున్నారు. జాయింట్ చెక్ పవర్ విధానంపై వారి అనుభవాలు, అభిప్రాయాలను అధికారులు నమోదు చేయనున్నారు.
గ్రామ పంచాయతీ వ్యవహారాలపై పూర్తి అవగాహన, చొరవ ఉన్న విద్యావంతులైన సర్పంచులు, ఉపసర్పంచులను సమావేశానికి ఎంపిక చేసి పంపాలని జిల్లా పంచాయతీ అధికారులు (డీపీఓలు)ను ఉన్నతాధికారులు ఆదేశించారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, మహిళలు సహా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా జిల్లాల వారీగా మార్గదర్శకాలు రూపొందించారు.
ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు వెల్లడించే అభిప్రాయాలు, క్షేత్రస్థాయి అనుభవాల ఆధారంగా జాయింట్ చెక్ పవర్ విధానంలో మార్పులు, చేర్పులపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
