‘ఉమ్మడి చెక్ పవర్’పై తెలంగాణ సర్కార్ కీలక కసరత్తు!
సర్పంచ్–ఉపసర్పంచ్ విభేదాలకు చెక్ పెట్టే దిశగా అడుగులు
నిధుల డ్రా, అభివృద్ధి పనుల్లో జాప్యంపై ప్రత్యేక సమీక్ష
సర్పంచుల అభిప్రాయాలు సేకరించిన పంచాయతీరాజ్ శాఖ

హైదరాబాద్: గ్రామపంచాయతీల్లో ‘ఉమ్మడి చెక్ పవర్’ వ్యవస్థపై తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలకంగా దృష్టి సారించింది. సర్పంచులు, ఉపసర్పంచుల మధ్య తలెత్తుతున్న విభేదాలు, పరస్పర రాజకీయ పోటీ, చెక్కులపై సంతకాల విషయంలో ఏర్పడుతున్న వివాదాల కారణంగా గ్రామాభివృద్ధి పనులు, పంచాయతీ నిధుల వినియోగం నిలిచిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేకంగా కసరత్తు చేపట్టింది.
హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యాలయంలో శాఖ కమిషనర్ శ్రీమతి డి. దివ్య (ఐఏఎస్) అధ్యక్షతన ‘ఉమ్మడి చెక్ పవర్’పై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఆహ్వానించిన సర్పంచులు సమావేశానికి హాజరై గ్రామస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, ఉమ్మడి చెక్ పవర్ కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
అభివృద్ధికి అడ్డుగా మారుతున్న విభేదాలు
కొన్ని గ్రామపంచాయతీల్లో సర్పంచ్–ఉపసర్పంచ్ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల చెక్కులపై సంతకాలు, నిధుల డ్రా, అభివృద్ధి పనుల అమలులో జాప్యం జరుగుతోందని సమావేశంలో చర్చించినట్లు సమాచారం. దీంతో గ్రామాల అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో పాటు పంచాయతీల నిర్వహణ కూడా ఇబ్బందికరంగా మారుతున్న అంశాన్ని అధికారులు పరిశీలించారు.
ప్రస్తుత ఉమ్మడి చెక్ పవర్ విధానాన్ని కొనసాగించాలా? అవసరమైన మార్పులు చేయాలా? లేక సర్పంచ్–పంచాయతీ కార్యదర్శి ఆధారిత విధానాన్ని అమలు చేయాలా? అనే అంశాలపై సర్పంచుల అభిప్రాయాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది.
వివిధ జిల్లాల నుంచి సర్పంచుల హాజరు ఈ సమావేశానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సర్పంచులు హాజరయ్యారు.
మహబూబ్‌నగర్: డి. చెన్న కేశవులు – పుట్టపల్లి,
వరంగల్: బి. మహేష్ – కొమ్ముగూడెం
యాదాద్రి భువనగిరి: కె. వెంకట్ రెడ్డి – కొండాపూర్
నిజామాబాద్: ఎం. రాజారెడ్డి – మోర్తాడ్
ఆదిలాబాద్: ఎం. కిషన్ – అంకోలి
నల్గొండ: కట్టా వెంకట్ రెడ్డి – మైలపురం, గుర్రంపోడు మండలం
మెదక్: వై. స్వామి – యావాపూర్
రంగారెడ్డి: జె. రవీందర్ రెడ్డి – గాందిచారల, అబ్దుల్లాపూర్‌మెట్
సర్పంచుల డిమాండ్లు.. ప్రభుత్వానికి కీలక సూచనలు
సమావేశంలో గ్రామపంచాయతీల ఆర్థిక, పరిపాలనా వ్యవహారాల్లో ఎదురవుతున్న సమస్యలను సర్పంచులు వివరించారు. పంచాయతీ నిధులు సకాలంలో వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి పనులు వ్యక్తిగత విభేదాల కారణంగా నిలిచిపోకుండా స్పష్టమైన విధానం రూపొందించాలని కోరినట్లు సమాచారం.‘ఉమ్మడి చెక్ పవర్’పై సర్పంచుల నుంచి వచ్చిన అభిప్రాయాలు, సూచనలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పంచాయతీరాజ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గ్రామాభివృద్ధి కోసం చెక్ పవర్‌పై క్లారిటీ ఎప్పుడు?
గ్రామపంచాయతీలకు నిధులు వచ్చినా వాటిని వినియోగించడంలో, అభివృద్ధి పనులు చేపట్టడంలో ఏర్పడుతున్న జాప్యానికి శాశ్వత పరిష్కారం చూపాలన్నది సర్పంచుల ప్రధాన ఆకాంక్ష. ఈ నేపథ్యంలో ‘ఉమ్మడి చెక్ పవర్’పై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం రాష్ట్రంలోని వేలాది గ్రామపంచాయతీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
