ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ
హైదరాబాద్: ప్రజలకు మరింత చేరువగా పరిపాలనను తీసుకెళ్లే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నేటి (సోమవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. రాష్ట్రంలోని 620 మండలాల్లో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులను స్వీకరించనున్నారు.
మండల స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను స్వీకరించనున్నారు. ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లే అవకాశం కల్పించడంతో పాటు, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయనున్నారు.
ప్రతి వినతిని అక్కడికక్కడే డిజిటల్ పోర్టల్లో నమోదు చేసి, అర్జీదారులకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ అందించనున్నారు. ఈ నంబర్ ఆధారంగా తమ ఫిర్యాదు ఏ దశలో ఉందో ప్రజలు సులభంగా తెలుసుకునేలా డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
మండల స్థాయిలోనే ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించడం ద్వారా జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడంతో పాటు, ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు, అవసరమైన పత్రాలతో హాజరుకావాలని అధికారులు సూచిస్తున్నారు.
