సర్పంచ్ కావాలన్నదే నా కల: CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్ కే

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలపై దేశ రాజధానిలో విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్ కే తనకు ఎలాంటి రాజకీయ పదవులపై ఆశలు లేవని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఉన్న తన స్వగ్రామం సంతోక్ పింప్రీకి సర్పంచ్‌గా సేవలందించడమే తన జీవిత లక్ష్యమని వెల్లడించారు.
ABP న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం తనకు లేదని, తన ఆశయం గ్రామాభివృద్ధి మాత్రమేనని చెప్పారు. అమెరికాలో ఉన్నత విద్యను పదవుల కోసం కాకుండా, సమాజానికి ఉపయోగపడేలా నేర్చుకోవడానికే అభ్యసించానని పేర్కొన్నారు.
బాల్యంలో చూసిన గ్రామీణ పరిస్థితులు తన ఆలోచనలను ప్రభావితం చేశాయని, గ్రామంలోని పాఠశాలల దుస్థితి, మౌలిక వసతుల కొరత తనను తీవ్రంగా కలిచివేసాయని చెప్పారు. గ్రామంలో మెరుగైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, నాణ్యమైన వైద్యసేవల కోసం ఒక ఆసుపత్రి నిర్మించడమే తన ప్రధాన లక్ష్యమని వివరించారు.
తాము ఏర్పాటు చేసిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) రాజకీయ పార్టీగా కాకుండా, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి మరింత బలంగా తీసుకెళ్లే ఒక రాజకీయ ఒత్తిడి (ప్రెజర్) గ్రూప్గా పనిచేస్తుందని అభిజీత్ దీప్ కే తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఇలాంటి సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
