ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎంపీడీవో కార్యాలయాల్లో ఫిర్యాదుల స్వీకరణ
హైదరాబాద్, ఆగస్టు 15: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించింది. ఇప్పటివరకు రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిల్లో కొనసాగుతున్న ప్రజావాణి ఇకపై ప్రతి మండల కేంద్రంలోనూ నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎస్ సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నెల 17వ తేదీ నుంచి ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు చిన్నచిన్న సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రాలు లేదా హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ మండల కేంద్రంలోనే అధికారులకు వినతులు సమర్పించే అవకాశం కలుగుతుంది.
మండల స్థాయి ప్రజావాణికి ఎంపీడీవో నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ప్రజల సమస్యలకు సంబంధించిన సుమారు 23 శాఖల అధికారులు తప్పనిసరిగా పాల్గొని వినతులను స్వీకరించనున్నారు. ఎంపీడీవో, తహసీల్దార్, ఎంపీవోలతో పాటు వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, విద్యుత్, మున్సిపల్, ఐసీడీఎస్, సంక్షేమ శాఖల అధికారులు ఇందులో పాల్గొంటారు.
ప్రజల నుంచి స్వీకరించే ప్రతి దరఖాస్తును వెంటనే ప్రజావాణి ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసి, అర్జీదారులకు డిజిటల్ రసీదు అందించనున్నారు. ప్రజావాణి కేంద్రాల్లో కంప్యూటర్, స్కానర్, ఇంటర్నెట్ సదుపాయాలతో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను పైస్థాయి అధికారులు కూడా ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.
ప్రజల సౌకర్యార్థం ప్రజావాణి కేంద్రాల్లో తాగునీరు, కూర్చునే సదుపాయం, దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు, హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
మండల స్థాయిలో ప్రజావాణి ప్రారంభం కావడంతో గ్రామీణ ప్రజలకు తమ సమస్యలను స్థానికంగానే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందే అవకాశం కలగనుంది.
