Headlinesజనాభా ప్రాతిపదికన పంచాయతీల గ్రేడింగ్ ఎప్పటికో ?

జనాభా ప్రాతిపదికన పంచాయతీల గ్రేడింగ్ ఎప్పటికో ?

Link Copied!

పంచాయతీలకు గ్రేడింగ్‌ ఇవ్వడంలో ప్రభుత్వ జాప్యం

జనాభా ప్రాతిపదికన పంచాయతీల విభజనకు మోక్షం ఎప్పుడు?

అధిక జనాభా పంచాయతీలకు జూనియర్‌ కార్యదర్శులే

తక్కువ జనాభా ఉన్న చోట్ల గ్రేడ్‌–1 కార్యదర్శులు

గ్రామ పంచాయతీలను జనాభా ప్రాతిపదికన గ్రేడ్లుగా విభజించి.. అందుకు అనుగుణంగా పంచాయతీ కార్యదర్శులను కేటాయించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఏ పంచాయతీకి ఏ స్థాయి కార్యదర్శి ఉండాలనే దానిపై స్పష్టత లేకపోవడంతో గ్రామపాలనలో గందరగోళం నెలకొంటున్నది. మరోవైపు జనాభా ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తుండగా..

తక్కువ జనాభా ఉన్న గ్రామాలకు సీనియర్‌ గ్రేడ్‌ కార్యదర్శులు పని చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. జనాభా ప్రాతిపదికన పంచా యతీలకు గ్రేడింగ్‌ చేస్తామని ప్రభుత్వం ఆరు నెలల క్రితమే వెల్లడించింది. అయితే ఇప్పటివరకు ఆ దిశగా స్పష్టమైన కార్యా చరణ చేపట్టకపోవడంతో సమస్య అలాగే కొనసాగుతున్నది. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాలు, పన్నుల వసూళ్లు, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు తదితర బాధ్యతలన్నీ కార్యదర్శులపైనే ఉండటంతో అధిక జనాభా ఉన్న పంచా యతీల్లో పని ఒత్తిడి మరింత పెరుగుతున్నది.

జనాభా ఆధారంగా గ్రామపంచాయతీల గ్రేడుల విభజన

నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీలను జనాభా ఆధారంగా వివిధ గ్రేడులుగా విభజించాల్సి ఉంటుంది.

5,000 మందికి పైగా జనాభా ఉన్న గ్రామపంచాయతీలను గ్రేడ్‌–1 పంచాయతీలుగా
3,000 నుంచి 5,000 వరకు జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడ్‌–2 పంచాయతీలుగా
2,000 నుంచి 3,000 వరకు జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడ్‌–3 పంచాయతీలుగా
1,000 నుంచి 2,000 వరకు జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడ్‌–4 పంచాయతీలుగా
విభజించాల్సి ఉంటుంది.

అంటే గ్రామపంచాయతీ జనాభా ఆధారంగా దాని గ్రేడ్‌, పరిపాలనా స్థాయి, సిబ్బంది మరియు ఇతర వనరుల కేటాయింపులు నిర్ణయించే విధానం అమల్లో ఉంటుంది. అయితే క్ష్షేత్రస్థాయిలో ఈ జనాభా నిష్పత్తికి అనుగుణంగా కార్యదర్శుల కేటాయింపు జరగడం లేదు. దీంతో అధిక జనాభా ఉన్న పంచాయతీల్లో తక్కువ గ్రేడ్‌ కార్యదర్శులు పనిచేస్తుండగా, మరోవైపు తక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు సీనియర్‌ గ్రేడ్‌ కార్యదర్శులు ఉండే పరిస్థితి ఏర్పడింది.

ప్రజలకు తప్పని తిప్పలు

గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన గ్రేడింగ్‌ చేసి, అందుకు అనుగుణంగా కార్యదర్శులను నియమిస్తేనే పరిపాలన మెరుగుపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అధిక జనాభా ఉన్న పంచాయతీల్లో పని భారం పెరగడంతో ధ్రువపత్రాలు, పన్నుల వ్యవహారాలు, పారిశుధ్యం, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక అంశాల్లో జాప్యం జరుగుతున్నదని చెబుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా ప్రతిపాదనలకే పరిమితం కాకుండా జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు గ్రేడింగ్‌ పూర్తి చేసి ఆ మేరకు కార్యదర్శుల కేటాయింపులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

తాజా వార్తలు

Related Articles