ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రేపు మార్చి 12న సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, కార్పోరేటర్లు, కార్పొరేషన్ మేయర్లకు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ, కార్యక్రమాలు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆదేశించారు.

రేపు 12న నిర్వహించే ఈ కార్యచరణ ప్రణాళికలో భాగంగా కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిర్వహించే శిక్షణ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్ మున్సిపల్ పరిపాలన కార్యదర్శి టి.శ్రీదేవి, సెర్ఫ్ సీఈవో దివ్య, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు సమర్ధవంతంగా అమలవుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి పదేపదే ఉటంకిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు ఏ విధంగానైతే ప్రామాణికమైన ఫలితాలు అందుతాయో ఆకోణంలో ఈశిక్షణ కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలు, కేంద్ర ప్రయోజత పథకాలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగేలా ఉండాలి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12,700 గ్రామపంచాయతీలు, 110 మున్సిపల్ సంస్థలు ఉన్నాయని వీటన్నిటిలో 15,000 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారని వివరించారు.
ఈ శిక్షణ ప్రారభోత్సవానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించాలని సిఎస్ స్పష్టం చేశారు. జిల్లాలోని వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలిపే ఫోటో ప్రదర్శన కూడా వేదిక వద్ద ఏర్పాటు చేయాలన్నారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు ఫైల్ క్లియరెన్స్, పారిశుద్ధ కార్యక్రమాల నిర్వహణ విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు కలెక్టర్లను రామకృష్ణారావు అభినందించారు.
కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మాట్లాడుతూ తమ విధులు బాధ్యతలు, అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు అమలులో సర్పంచుల పాత్ర తదితర అంశాలపై శిక్షణ నిర్వహించాలన్నారు. మునిసిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ సిటిజెన్ చార్టర్, మున్సిపల్ చట్టాలు, ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రాం, అమృత్ తదితర కార్యక్రమాలపై మున్సిపల్ ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించాలన్నారు. సెర్ప్ సీఈవో దివ్య మాట్లాడుతూ ఈనెల 12 ఏర్పాటు చేసే శిక్షణకు సంబంధించిన సవివరమైన నోట్‌ను ఇప్పటికే కలెక్టర్లకు పంపామన్నారు.
