జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ :ప్రజా సేవల కోసం పనిచేయాల్సిన గ్రామ పంచాయతీ సిబ్బందితో కొందరు సర్పంసులు తమ వ్యక్తిగత పనులు చేయించుకుంటున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. మండలంలోని జూబ్లీనగర్ గ్రామ సర్పంచ్, పంచాయతీ సిబ్బందితో తమ ఇంటి నిర్మాణ పనులు, గ్రామంలో చేపట్టిన సీసీ రోడ్డు పనులు, అలాగే వ్యవసాయ పనులు చేయించుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నాలుగు రోజుల క్రితం తన వ్యవసాయ క్షేత్రంలో వరి ధాన్యాన్ని గ్రామ పంచాయతీ సిబ్బందితో అలికించినట్లు మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)కు ఫిర్యాదు అందినట్లు సమాచారం. అంతేకాకుండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను కూడా వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ విషయంపై రేగొండ ఎంపీడీవో వెంకటేశ్వరరావును వివరణ కోరగా, జూబ్లీనగర్తో పాటు తిరుమలగిరి గ్రామాల సర్పంసులు తమ వ్యక్తిగత పనులను గ్రామ పంచాయతీ సిబ్బందితో చేయించుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టి, వాస్తవాలు తేలిన అనంతరం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
(“స్థానికంగా వచ్చిన ఫిర్యాదుల ప్రకారం” “అధికారుల ప్రకటన మేరకు”)
