
నల్లగొండ జిల్లా రామిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్‌తో పాటు నల్లగొండ జిల్లా సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లపంగి నరసింహ బహుజన సాహిత్య అకాడమీ జాతీయ స్థాయి ఉత్తమ సర్పంచ్ అవార్డుకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సాహిత్యాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రజా ఉద్యమకారులు, సంఘ సేవకులు, రచయితలు, కవులు, స్వచ్ఛంద సంస్థలు మరియు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ప్రతి ఏడాది బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ అవార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు.
వెస్టర్న్ ఇండియాలోని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, గోవా రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారు 600 మంది ప్రతినిధులు (డెలిగేట్స్) ఈ జాతీయ మహాసభలకు హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాతీయ మహాసభల్లో లపంగి నరసింహకు జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని బహుజన సాహిత్య అకాడమీ కార్యాలయంలో ఎల్. నరసింహకు అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
గ్రామాభివృద్ధి, స్థానిక పాలనలో సమర్థవంతమైన సేవలు, ప్రజలకు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, సర్పంచులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ నరసింహకు అభినందనలు తెలిపారు.
