జనగామ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా నర్మెట గ్రామ సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆయన అధికారిక నియామక పత్రాన్ని అందుకున్నారు.

ప్రజా సంక్షేమం, గ్రామాభివృద్ధి పట్ల అంకితభావంతో పనిచేస్తూ నర్మెట గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న శ్రీధర్ గౌడ్ సేవలను గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించినట్లు నాయకులు తెలిపారు. జనగామ జిల్లాలోని సర్పంచుల సమస్యల పరిష్కారం, గ్రామ పంచాయతీల బలోపేతం, స్థానిక సంస్థల హక్కుల పరిరక్షణలో ఆయన సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచులను ఒకే వేదికపై ఏకం చేసి, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామ పంచాయతీలకు మరింత బలోపేతం కల్పించడం, సర్పంచుల హక్కుల పరిరక్షణ, గ్రామాభివృద్ధి కార్యక్రమాల అమలులో తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.
శ్రీధర్ గౌడ్ నియామకంపై జిల్లా వ్యాప్తంగా సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో జనగామ జిల్లా సర్పంచుల సంఘం మరింత బలోపేతమై, సర్పంచుల హక్కుల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ, సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు సంపత్ నాయక్, వెంకట్, జిల్లా సర్పంచులు నీల కరుణాకర్, బానోత్ మహేందర్ నాయక్, కొర్ర రాజేందర్ నాయక్ తదితరులు పాల్గొని గోపగోని శ్రీధర్ గౌడ్‌కు అభినందనలు తెలియజేశారు.
