
భద్రత లేదు…. జీతాలు రావు
ఈ-పంచాయతీ పోర్టల్లో పేరు నమోదుకాని మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలు రావట్లేదు. రెక్కలు ముక్కలు చేసుకొని రోజంతా కష్టపడి పనిచేసినప్పటికీ కుటుంబాన్ని సాకటం కష్టతరమవుతోంది. కొద్దిపాటి బంగారం, ద్విచక్ర వాహనాలు కుదువ పెట్టి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన దుస్థితి దాపురించిందని మల్టీపర్పస్ వర్కర్లు వాపోతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 471 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో పంచాయతీలో ఐదారుగురు చొప్పున 2,144 మంది మల్టీపర్పస్ కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ గ్రామంలోని చెత్తను ఎత్తి డంపింగ్యార్డులకు తరలిస్తారు. ఏ రక్షణ పరికరాలు లేకుండా కాల్వలు శుభ్రపరు స్తారు. బిల్లులు వసూలు చేసి ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. రోజూ చాకిరీ చేసినా వీరికి ఇచ్చే వేతనం కేవలం రూ.9,500 మాత్రమే. అదీ ఈ-పోర్టల్లో పేర్లు నమోదైన కార్మికులకే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా వేతనాలు అందుతున్నాయి. పేర్లు లేని వారికి వేతనాలను వేరే మార్గాల్లో చెల్లిస్తారు.
జనరల్ ఫండ్ నుంచి సర్దుబాటు
ఈ-పోర్టల్లో పేర్లు నమోదుకాని మల్లీపర్పస్ కార్మికులు 87 మంది ఉన్నారు. గతంలో చేరి మానేసిన కార్మికులు, మృతి చెందిన వారి స్థానాల్లో కొందరు చేరారు. వీరికి వేతనాలు రాష్ట్రస్థాయి నుంచి రావు. ఆయా పంచాయతీల్లో జనరల్ఫండ్ నుంచి పాలకులు ఇవ్వాల్సి ఉన్నా.. నిధుల్లేక వీరికి జీతాలు చెల్లించే పరిస్థితి లేదు. కుటుంబ పోషణకు వేరే పనులకు వెళ్తే వీరిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని పంచాయతీ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. గత్యంతరం లేక మల్టీపర్పస్ కార్మికులు కడుపులు కాల్చుకొని పనులు చేస్తున్నారు. ఈ-పోర్టల్లో పేర్లు చేర్చాలని అధికారుల చుట్టూ తిరుగు తున్నా.. స్పందించట్లేదని వాపోతున్నారు.
పాల్వంచ ఎంపీడీఓ నారాయణ స్పందిస్తూ.. ఈ-పోర్టల్లో పేర్ల నమోదు తప్పనిసరి. ఎవరి పేర్లు నమోదుకాలేదో వారందరి వివరాలను జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకులిఖితపూర్వకంగా పంపించామన్నారు.
జిల్లాలో పంచాయతీలు 471
మల్టీపర్పస్ వర్కర్లు: 2,144
ఈ- పోర్టల్లో పేర్లు నమోదు కాని కార్మికులు: 87
