
గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచులు పని చేయాలి: మంత్రి సీతక్క
నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. గురువారం మహబూబాబాద్ లో నిర్వహించిన 99 రోజుల కార్యక్రమంపై అవగాహన, పంచాయతీరాజ్ చట్టాల శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో వాటి పరిష్కారం కోసం సమగ్రమైన ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం, 16వ ఆర్ధిక సంఘం నిధులను సరియైన పద్ధతిలో వినియోగించుకోవాలని తెలిపారు. ఏమైనా పొరపాటు తలెత్తితే సర్పంచులే బాధ్యత వహించి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుదన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా నిధులను వినియోగిస్తే సర్పంచులపై చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తే లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద సమస్యేమీ కాదన్నారు. పురపాలక సంఘాల్లో కూడా ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు పట్టణాభివృద్ధిపై నిర్దిష్టమైన ప్రణాళికలు తయారు చేయాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్రావు, కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్, అనిల్ కుమార్, పురపాలక సంఘం చైర్ పర్సన్ జ్యోతి, వైస్ చైర్మన్ సోమయ్య పాల్గొన్నారు.
