తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా సర్పంచుల సంఘం సభ, సన్నాహక సమావేశం ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శివ కన్వెన్షన్లో ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశానికి రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు మెంటపల్లి పురుషోత్తం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి మందిపల్లి వెంకట్, పాలమూరు జిల్లా మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు మోదీపూర్ రవి, గద్వాల జిల్లా సర్పంచుల సంఘం కన్వీనర్ రాజశేఖర్, వనపర్తి జిల్లా కన్వీనర్ డాక్టర్ శేఖర్ గౌడ్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలకు చెందిన పలువురు గౌరవ సర్పంచులు సమావేశానికి హాజరయ్యారు.
సమావేశంలో గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులు, సర్పంచుల సమస్యలు, గ్రామ పంచాయతీలకు నిధులు, విధులు, అధికారాల కల్పన, ఆర్థిక స్వయం ప్రతిపత్తి, గ్రామాభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా పలు అంశాలపై ఏకగ్రీవంగా కీలక తీర్మానాలు ఆమోదించారు.
సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే సమర్పించి, వాటిపై సానుకూల నిర్ణయం తీసుకొని త్వరితగతిన అమలు చేయాలని సమావేశం కోరింది. సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే గ్రామ పంచాయతీల పాలన దెబ్బతిని, గ్రామీణ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రామ స్వపరిపాలన వ్యవస్థను బలోపేతం చేయాలంటే పంచాయతీలకు రాజ్యాంగబద్ధమైన నిధులు, విధులు, అధికారాలను సంపూర్ణంగా అమలు చేయడంతో పాటు సర్పంచుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని సమావేశం ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది.
