పాల్వంచ: కుడికాలికి వాపు రావడంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన పాల్వంచ మండలం దంతలబోరు ఎస్సీ కాలనీ గ్రామ సర్పంచ్ సోడే వెంకటరమణ (36) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
సర్పంచ్ భర్త ప్రేమ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మూడేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో వెంకటరమణ కుడికాలుకు గాయమైంది. అప్పట్లో భద్రాచలంలోని మోహన్‌రావు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇటీవల అదే కాలుకు మళ్లీ వాపు రావడంతో బుధవారం ఆ ఆసుపత్రిలో చేర్పించారు. ఇన్ఫెక్షన్ తీవ్రత పెరగడంతో ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులు శుక్రవారం అంబులెన్స్‌లో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటరమణ మృతి చెందారు.
మృతురాలికి భర్త ప్రేమ్ కుమార్‌తో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు.
భార్య మృతికి చికిత్సలో నిర్లక్ష్యమే కారణమని ఆరోపించిన ప్రేమ్ కుమార్.. మృతదేహంతో కలిసి శుక్రవారం రాత్రి భద్రాచలంలోని మోహన్‌రావు ఆసుపత్రి వద్ద బంధువులతో కలిసి ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని ఘటనపై విచారణ ప్రారంభించారు.
సర్పంచ్ వెంకటరమణ మృతి పట్ల ఎంపీడీఓ రాజారావు, ఎంపీఓ షబ్న సంతాపం తెలిపారు.
గ్రామంలో విషాద ఛాయలు
అందరితో కలిసిమెలిసి ఉండే వెంకటరమణ ఆకస్మిక మరణంతో దంతలబోరు ఎస్సీ కాలనీలో విషాద వాతావరణం నెలకొంది. ఆమె మృతి పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, పరిసర మండలాల సర్పంచులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
